Wednesday, December 28, 2016

కృష్ణం

నడిచే దారిలో వెలుతురు లేకపోతే
ఎండలేదని సంతోషపడ్తం
నీడ లేకపోతే
వెలుతురు ఉందని సంతోషపడ్తం

అడుగులు పడే నేల నీళ్ళతో మడుగులను మరిపిస్తుంటే  కాళ్లు తడిచాయని
పై కప్పులు ఎగిరిపోయే హోరు గాలి వీస్తే చెమటలు పట్టలేదని 

చేసే ప్రతి పనిలో
నష్టాల్ని తప్పించుకుంటూ
కష్టాల్ని వెతుక్కుంటూ

ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియక
చూపు ఎటు వైపుంటే అటు వెళ్తూ
హక్కులు అనే మాటను మరుస్తూ
              తరిస్తూ
ఇదే జీవితం అని పరితపిస్తూ
అందరికి సూత్రాలను సంభోదిస్తూ
ప్రతి క్షణం గమ్యం లేని ప్రయాణాలను సృష్టస్తూ

          ఏడుపులో నవ్వును
           నవ్వులో బాధను
           బాధలో అశ్చర్యం
అన్నిటి లో  నిస్సహయాన్ని ప్రదర్శిస్తూ
సాగుతూ తూగుతూ వెళ్ళడమే పరమార్ధం అని నమ్మి

మనలాగ లేకపోతే వింత అని విడదిసేద్దాం 
కొత్తగ కనపడితే దూరం చేద్దాం
అవకాశం లేకపోతే నిట్టూర్పు విసిరేద్దాం

మనకి వచ్చిన పనిని అయిన ప్రయత్నలోపం లేకుండా చెయ్యాలి కదా!!!!!!!

Wednesday, November 16, 2016

కృష్ణం

నీ నవ్వు నా చెవులకు కొత్త శబ్దాలని పరిచయం చేసింది
నాగుండె చప్పుడుకి కూడా శృతి లయలు ఉంటాయని చెప్పింది
నీ చూపు నా కళ్ళకు కొత్త రంగల్ని  అద్దింది
నలుపు తెలుపులకు కూడా భావాలుంటాయని 
నేర్పించింది
కదిలే కాలం నీ నడక ఒకటే నువ్వు ఆగితే  నా చూట్టూ ప్రపంచం ఆగిపోయింది

ఎదురు చూసే ఆశల వృక్షానికి అడుగులతో ఊపిరి అందించి కోత్త పూలను పూయించావు
నా నీడ చెంతకు నువ్వు చేరితే  ఆ పరిమళాలతో
స్వాగతం చెప్తాను
సుగంధల సుమ వర్షం లో నిన్ను తడిపేస్తాను

ప్రశ్నల తూఫానుల మధ్య
సందేహల సుడిగుండాల చివరన
ఈదలేక ఎగరలేక
కొట్టుమిట్టాడుతోంది ప్రాణం

అలా సగం నవ్వి
         సగం చూసి
నన్ను సగం చంపేసావు
నిజాలకు దూరంగా 
అబద్దాలకు దగ్గరగా
బతుకుతుంటే 
చూడ్డానికి వినడానికి బాగనే ఉంది
కాని నీతో పూర్తిగా చంపించుకోవాలని ఉంది

ఈ సంధిగ్దం ఇప్పట్లో తొలగదు
దీనికి జవాబు నీ దగ్గరే ఉంది
తూర్పు అయిన పడమర అయిన
మిన్ను అయిన మన్ను అయిన
నాలో వెలుగు తగ్గిపోదు
నీ నవ్వు నా కోసం కాకపోయిన
నీ చూపు నా కోసం వెతక్కపోయిన
నా చూపు నీన్ను చూసినతరువాత నవ్వడం మాత్రం ఆపదు

Tuesday, October 11, 2016

కృష్ణం

ఆమావాస్య రోజు చుక్కల్ని
పూర్ణిమ రోజు చంద్రుడిలో మచ్చల్ని లెక్కపెడుతూ
నిశీలో ఉన్నప్పుడు  వెలుగు కోసం 
వెలుగులో ఉన్నప్పుడు నీడ కోసం పరిగెడుతూ
వెన్నెల వన్నెల
నవ్వుల నెలవిలా
నిలువెల్ల
నలుపై తెలుపై
విరుపై  గెలుపై
తగలబెడుతుంటే
జ్వలిస్తూ చీకట్లో కలిసిపోతావో 
జ్వాలముఖివై  కాగడలా చీకట్లో దారి చూపుతావో
మబ్బుల చాటున నిలబడి నీడలో కలిసిపోతావో
ఎండలో నిలబడి నలుగురికీ  నీడను ఇస్తావో

నీ రాతలో కాదు నీ చేతిలో ఉంది

Saturday, August 27, 2016

కృష్ణం

నలుపు తెలుపుల తలపులు
గెలుపు అలుపుల అరుపులు
అనిపించే వినిపించే కనిపించని నిశబ్దాన్ని 
తెంచుతూ తుంచుతూ

రెక్కలు విప్పి
చుక్కల చెంతకు
దిక్కులు దాటి
విహంగమై విహరిస్తూ
నింగికి నేలకి మధ్య దూరం నేనేనన్న అహం
అహం బ్రహ్మస్మి  అనే   అహం

నెత్తి మీద కళ్లుంటే  
ఖగము కూడ ఖరము అవుతుంది
ఎంత ఎగిరినా  ఉన్న చోటే కూలుతుంది
ఎగరడం మొదలు పెట్టిన చోటే రాలుతుంది

విలయపు వలయంలో వలపు వర్ణాలు
ప్రళయపు ప్రపంచంలో ప్రణయ రాగాలు
కొన్ని సార్లు మాత్రమే సాహసం
అన్ని సార్లు అంటే తెలివి తక్కువ తనం

లోకాలు తిరిగి సంపాదంచే విజ్ఙానం కన్న
నీ చుట్టూ చూస్తే వచ్చే  జ్ఙానం మిన్న
అత్యవసర వేగం ,అనవసర ప్రయోగం
ఎప్పుడు పనికి రావు

ఎప్పుడు ఎగురుతునే ఉంటే
దారి మరిచపోతావు గమ్యం మర్చిపోతావు
చివరకు నిన్ను నువ్వు మర్చిపోతావు
నిశి నుంచి దూరంగ వెళ్తు నీ నీడను వదిలేస్తావు
తిరిగింది చాలు ఇక దిగు

గాలి లో మేడలు కట్టడం తప్పు కాదు
కాని పైకి చూస్తూ కింద నడుస్తే
రాయి తగిలి కింద పడతావు
             జాగ్రత్త

Wednesday, August 24, 2016

కృష్ణం

ఉదయం నలుపు
రాత్రికి తెలుపు
పెయ్యి లో ఒకలా
గొయ్యి లో ఒకలా

కృష్ణుడిని కొలుస్తూ  కంసుడిని అనుసరిస్తూ
రాముడిని పొగుడుతూ రావణుడిని స్మరిస్తూ

చరణం పై చర్మాన్ని  ప్రతిరోజు  తొలుస్తూ
కుబుసం విడిచే పాము

అద్దం లో అయిన నీకు నువ్వు కనపడితే
ఒక్క సారి   పలకరించుకో

Sunday, August 21, 2016

కృష్ణం

తెర చాప పెట్టుకున్న  పడవ 
గాలి వీస్తే  ఏ దిక్కైన వెళ్తుంది
దిక్సుచి తొ పని లేదు

తీరం చేరే లోపు తెడ్డు న మిగుల్తుందా????

వరదైన ఉప్పెనైన  
జడి వాన లో నిలువెల్ల తగలడుతు 
పడవ లో వడివడిగ అడుగులు వేస్తున్న

         ఓ బాటసారీ 
పడవలో కాదు తీరం దాటి గట్టు మీద నడు!!!!!!!!!