నలుపు తెలుపుల తలపులు
గెలుపు అలుపుల అరుపులు
అనిపించే వినిపించే కనిపించని నిశబ్దాన్ని
తెంచుతూ తుంచుతూ
రెక్కలు విప్పి
చుక్కల చెంతకు
దిక్కులు దాటి
విహంగమై విహరిస్తూ
నింగికి నేలకి మధ్య దూరం నేనేనన్న అహం
అహం బ్రహ్మస్మి అనే అహం
నెత్తి మీద కళ్లుంటే
ఖగము కూడ ఖరము అవుతుంది
ఎంత ఎగిరినా ఉన్న చోటే కూలుతుంది
ఎగరడం మొదలు పెట్టిన చోటే రాలుతుంది
విలయపు వలయంలో వలపు వర్ణాలు
ప్రళయపు ప్రపంచంలో ప్రణయ రాగాలు
కొన్ని సార్లు మాత్రమే సాహసం
అన్ని సార్లు అంటే తెలివి తక్కువ తనం
లోకాలు తిరిగి సంపాదంచే విజ్ఙానం కన్న
నీ చుట్టూ చూస్తే వచ్చే జ్ఙానం మిన్న
అత్యవసర వేగం ,అనవసర ప్రయోగం
ఎప్పుడు పనికి రావు
ఎప్పుడు ఎగురుతునే ఉంటే
దారి మరిచపోతావు గమ్యం మర్చిపోతావు
చివరకు నిన్ను నువ్వు మర్చిపోతావు
నిశి నుంచి దూరంగ వెళ్తు నీ నీడను వదిలేస్తావు
తిరిగింది చాలు ఇక దిగు
గాలి లో మేడలు కట్టడం తప్పు కాదు
కాని పైకి చూస్తూ కింద నడుస్తే
రాయి తగిలి కింద పడతావు
జాగ్రత్త